Pakistan: పాక్ ప్రధాని తన మాటను నిలబెట్టుకోవాల్సిందే: స్పష్టం చేసిన అమెరికా

  • పాక్ భవిష్యత్తు కోసం ఉగ్రవాదులను అంతమొందిస్తామన్న ఇమ్రాన్
  • ఇటీవల కొందరు ఉగ్రవాద నేతల అరెస్టు 
  • వారిపై విచారణ జరపాలని అమెరికా సూచన

పాకిస్థాన్ భవిష్యత్తు కోసం ఉగ్రవాదులను అంతమొందిస్తామని చెప్పిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాటను నిలబెట్టుకోవాలని అమెరికా చెప్పింది. ఇటీవల అరెస్టు చేసిన ఉగ్రవాదులపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది. ఉగ్రవాద నేతలను అరెస్టు చేసి, తిరిగి విడుదల చేసే అలవాటున్న పాక్ తీరుపై అమెరికా దక్షిణ-మధ్య ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ కార్యదర్శి అలైస్‌ వెల్స్‌ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 'హఫీజ్ సయీద్ తో పాటు ఇతర ఉగ్రవాద నేతలపై విచారణ జరపాలని లష్కరే తోయిబా జరిపిన భీకర దాడులకు బాధితులైన వారు కోరుకుంటున్నారు' అని ఆమె పేర్కొన్నారు. ఆ ఉగ్రవాదులను అరెస్టు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే వారందరినీ తప్పక విచారించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

కాగా, ప్రస్తుతం ప్యారిస్ లో ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) సదస్సు జరుగుతోంది. ఇప్పటికే పాక్ ను ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రే లిస్టులో పెట్టింది. త్వరలో పాక్ ను బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశాలు లేకపోలేదు. ఉగ్రవాదుల పట్ల తన తీరును మార్చుకోకపోతే ఇరాన్‌, ఉత్తర కొరియాలతో పాటు పాక్ ను కూడా బ్లాక్‌లిస్టులో చేరుస్తామని ఇప్పటికే ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పాక్.. ఇటీవల కొందరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది.

More Telugu News