Venkaiah Naidu: ఉగ్రవాద మద్దతుదారులను ఒంటరి చేయాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • ప్రపంచం వారిని బహిష్కరించడమే గుణపాఠం
  • ఆఫ్రికా దేశంలోని సియోర్రా లియోన్‌ పర్యటనలో ప్రసంగం
  • అన్ని దేశాలు సమష్టిగా ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపు

ప్రపంచంలోని దేశాలన్నీ ఉగ్రవాదంపై సమష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాల్ని ఏకాకులను చేయాలని భారత్‌ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న వెంకయ్య సియోర్రా లియోన్‌లో నిన్న జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ ఉగ్రవాదమేనన్నారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశాలను ఏకాకులను చేయడమే వారికి తగిన గుణపాఠం అవుతుందని అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మద్దతుగా నిలుస్తున్న సియోర్రా లియోన్‌ అధ్యక్షుడు జులియస్‌ మాడా బయోకు ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన భారత్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తగిన ప్రాధాన్యం కల్పించాల్సి అవసరం ఉందని చెప్పారు.

అనంతరం అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడుతూ సియోర్రా లియోన్‌, భారత్‌ మధ్య సత్సంబంధాలకు వారధిగా భారతీయులు నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, ఆహార శుద్ధి, సమాచార సాంకేతిక రంగాల్లో భారత్‌, సియోర్రా లియోన్‌ పరస్పర సహకారం మరింత పెరిగేలా చూడాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు.

More Telugu News