Prakasam District: ఈ మేక పిల్లది రూటే సెపరేటు... పైపు నీరైతేనే తాగుతుంది!

  • వాగులు, చెరువులు, నదుల నీటి జోలికి వెళ్లదు
  • తోటి మేకలతో కలిసి తొట్టెలో నీరు తాగదు
  • ఆశ్చర్యపోతున్న పెంపకందారుడు

అలవాట్లు మీకేనా...నాకుండకూడదా? మీరు బిసిలెరీ వాటర్‌ తాగితే తప్పులేదు...నేను బోరు నీరు మాత్రమే తాగితే తప్పా? అన్నట్టుంది ఈ మేక వ్యవహారం. మేకేంటి....బోరు నీరేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ కథనం చదవండి. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన మూరబోయిన లవయ్య, రాజమ్మ దంపతులకు మేకల పెంపకమే జీవనాధారం. ఐదేళ్ల క్రితం వీరు ఓ మేకను కొనుగోలు చేశారు. ఈ మేకకు ఓ పిల్ల జన్మించింది. అన్ని మేకలతోపాటు ఈ తల్లీ పిల్లల్ని కూడా లవయ్య మేతకు  తీసుకు వెళ్లాడు. మేత పూర్తయ్యాక నీరు తాగించేందుకు సమీపంలో ఉన్న ఓ బోరు వద్దకు తీసుకువెళ్లాడు.

బోరు వద్ద తొట్టె ఏర్పాటు చేశాడు. లవయ్య చేతి పంపు కొడుతుండగా మేకలు తొట్టెలో పడిన నీరు తాగుతూ దాహార్తి తీర్చుకున్నాయి. కానీ ఈ మేకపిల్ల మాత్రం తొట్టెలో నీరు తాగకుండా బోరు గొట్టం నుంచి పడుతున్న నీటిని మాత్రమే తాగింది. అప్పటి నుంచి అదే అలవాటుగా మార్చుకుంది.

మేత కోసం పొలాల్లోకి తీసుకువెళ్లినా వాగులు, కాలువలు, చెరువుల్లోకి దిగి అన్ని మేకలు నీరు తాగినా ఈ మేకపిల్ల మాత్రం ఆ నీటివైపు కన్నెత్తి కూడా చూడదు. దారిలో ఎక్కడైనా బోరు కనిపిస్తే మాత్రం దాని వద్దకు పరిగెడుతుంది. దీంతో లవయ్యకు ఇదో సమస్యగా మారింది. ఈ మేకపిల్ల దాహార్తి తీర్చేందుకు తప్పనిసరిగా బోరు వెతకాల్సి వస్తోంది.

More Telugu News