సినిమా కలెక్షన్లపై మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పింది నిజమే: సినీ వ్యాపార విశ్లేషకుడు కోమల్ నహతా

14-10-2019 Mon 10:38
  • దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం సినిమాలు అంతగా సాయం చేయవు
  • ఒకేరోజు రూ.120 కోట్లు రాబట్టడం సినీ చరిత్రలో ఇదే తొలిసారి
  • ఇంతకు ముందు బాహుబలి-2 ఒకే రోజు రూ.112 కోట్లు రాబట్టింది
ఒకే రోజు విడుదలైన మూడు సినిమాలు రూ.120 కోట్లు సంపాదించాయని, దీంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాలు రికార్డు స్థాయిలో ఒకే రోజు ఇంతమొత్తాన్ని రాబట్టినట్లు తనకు సినీ వ్యాపార విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పారని కూడా ఆయన అన్నారు.

తాజాగా దీనిపై కోమల్ స్పందించారు. 'సినిమాల కలెక్షన్ల విషయంలో రవిశంకర్ ప్రసాద్ చెప్పింది నిజమే. ఒకేరోజు రూ.120 కోట్లు రాబట్టడం సినీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంతకు ముందు బాహుబలి 2 ఒకే రోజు రూ.112 కోట్లు రాబట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థకు సినీ పరిశ్రమ చాలా తక్కువ స్థాయిలో సహకారం అందిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు కేవలం ఒకటి లేదా రెండు శాతం మాత్రమే సాయం చేస్తోంది. సినీ పరిశ్రమ తన వ్యాపారంలో సాధించే కలెక్షన్లు ఎప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి కానీ, దేశ ఆర్థిక వ్యవస్థకు మాత్రం అంతగా ఉపకరించవు' అని చెప్పారు.