Tsrtc: సీఎం కేసీఆర్ కు ‘మేఘా’ కృష్ణారెడ్డి ప్రయోజనాలే తెలుసు!: ప్రొఫెసర్ కోదండరామ్

  • తెలంగాణ రాకముందే ఆర్టీసీ విలీనం ప్రక్రియ మొదలైంది
  • ప్రజా ప్రయోజనాలు కేసీఆర్ కు తెలియవు
  • టీఎస్సార్టీసీని ప్రభుత్వమే నాశనం చేసింది

టీఎస్సార్టీసీని ప్రభుత్వమే నాశనం చేసిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ విమర్శించారు. హన్మకొండలోని ఏకశిలపార్క్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. ఆర్టీసీని లాభనష్టాలతో చూడొద్దని సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమంటే అర్థం ఏంటంటే.. ‘మాకు రావాల్సిన పైసలు బాధ్యతగా బడ్జెట్ లో పెట్టి ఇవ్వమని అడుగుడు..’ అని అన్నారు. తెలంగాణ రాకముందే ఆర్టీసీ విలీనం ప్రక్రియ మొదలైందని, ఇవాళేమీ కొత్తకాదని, ఇందుకు సంబంధించిన కమిటీల ఏర్పాటు చేయడం, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, జీవోలు వెలువడే ముందు రాష్ట్ర విభజన జరిగింది అని గుర్తుచేశారు. ఆర్టీసీ విలీనం ఏపీలో పూర్తయింది, తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీని బ్రహ్మాండంగా నడుపుకుంటామని నాడు కేసీఆర్ అన్న మాటలను ఈ సందర్భంగా కోదండరామ్ గుర్తుచేశారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ కు మేఘా కృష్ణారెడ్డి ప్రయోజనాలు తెలుసుగానీ, ప్రజా ప్రయోజనాలు తెలియవని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. రాష్ట్రానికి పట్టిన పీడను మనం వదిలించాలే తప్ప, ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ఎవరూ అధైర్యపడొద్దని, ధైర్యంగా నిలబడాలని, ఎక్కడా ఆత్మహత్యల జరగకూడదని అన్నారు.

More Telugu News