Rafale: స్వాగతించాల్సింది పోయి విమర్శలు మొదలెట్టారు: కాంగ్రెస్ పై రాజ్ నాథ్ సింగ్ విమర్శలు

  • కాంగ్రెస్ నేతలు వివాదం రేపుతున్నారు
  • రాఫెల్ ఉంటే బాలాకోట్ వరకు వెళ్లే అవసరం లేకుండా పోయేది
  • ఇక్కడి నుంచే ఉగ్రవాదులపై దాడులు జరిపేవాళ్లం

రాఫెల్ యుద్ధ విమానంపై తాను 'ఓం' అని రాశానని, దానికి 'రక్షా బంధన్' కట్టానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన హర్యానాలోని కర్నాల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చేసిన విమర్శలపై స్పందించారు.

'దేశంలో కాంగ్రెస్ నేతలు రాఫెల్ విషయంపై వివాదం రేపుతున్నారు. దేశానికి రాఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని వారు స్వాగతించాల్సిందిపోయి, విమర్శలు చేయడం మొదలెట్టారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్థాన్ కు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు.

'మన వద్ద ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాలు ఉంటే, ఉగ్రవాదులపై దాడులు జరపడానికి మనం బాలాకోట్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అక్కడి ఉగ్రవాద శిబిరాలను మనం ఇక్కడి నుంచే రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా నాశనం చేసే వాళ్లం' అని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ లో పర్యటించిన ఆయన.. తొలి రాఫెల్ విమానాన్ని అధికారికంగా అందుకుని, దానికి ఆయుధ పూజలు చేసిన విషయం తెలిసిందే. యుద్ధ విమానాలకు పూజలేంటంటూ దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

More Telugu News