King koti building: ప్రైవేటు చేతికి నిజాం కింగ్‌ కోఠీ ప్యాలెస్‌

  • పరదాగేట్‌ను రూ.150 కోట్లకు కొనుగోలు చేసిన  ‘ఐరిస్‌’ హోటల్స్‌
  • 70 ఏళ్లుగా వారసుల చేతుల్లో ఉన్న చారిత్రక భవనం
  •  ముంబైకి చెందిన నిహారిక కనస్ట్రక్షన్స్‌కు అమ్మేసిన ట్రస్టు

హైదరాబాద్‌ నిజాం చారిత్రక వారసత్వ సంపదకు చిహ్నం అయిన కింగ్‌ కోఠీ ప్యాలెస్‌ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఈ కట్టడాన్ని నజ్రీబాగ్‌ (పరదాగేట్‌)గా వ్యవహరిస్తారు. డెబ్బయి ఏళ్లుగా నిజాం వారసుల ఆధీనంలో ఉన్న ఈ ప్యాలెస్‌ను ట్రస్టు అమ్మకానికి ఉంచగా ఢిల్లీకి చెందిన ప్రముఖ హోటల్స్‌ సంస్థ ‘ఐరిస్‌’ ఈ భారీ భవంతిని కొనుగోలుచేసింది. ప్యాలెస్‌ను కొనుగోలుచేసిన సంస్థ ఈ భారీ భవనాన్ని కూల్చివేసి బిజినెస్‌ మాల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ఐదు వేల గజాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌ ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ వ్యక్తిగత నివాసంగా వెలుగొందింది. ఈ భవనానికి పరదా ఉంటుంది. అలీఖాన్‌ భవనంలో ఉంటే పరదా లేపి ఉంచే వారు. లేదంటే దించేవారు. ఇప్పటికీ ఈ భవనానికి పరదా వేసి ఉంటుంది. అందుకే దీనికి పరదాగేట్‌ అంటారు.

ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈభవనంలోనే కన్నుమూశారు. ఈ భవనం చాలాకాలం ప్రిన్స్‌ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా జీపీఏ హ్డోర్‌గా వ్యవహరించారు. ఎస్త్రా నుంచి ముంబైకి చెందిన నిహారిక కనస్ట్రక్షన్స్‌ కంపెనీ కొనుగోలు చేయగా, తాజాగా నిహారిక నుంచి ఐరిస్‌ హోటల్స్‌ రూ.150 కోట్లకు దీన్ని సొంతం చేసుకుంది.

ఈ ప్యాలెస్‌లో మొత్తం మూడు భవనాలుండగా ఒకదాంట్లో ఈఎన్‌టీ ఆసుపత్రి, మరో దాంట్లో నిజాం ట్రస్టు కొనసాగుతున్నాయి. మొఘల్‌, యూరోపియన్‌ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో నిర్మించిన ఈ భవనం భారతీయ వారసత్వ సంపద జాబితాలో ఉంది. అయితే సరైన నిర్వహణ లేకపోవడంతో భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది.

అందుకే భవనాన్ని కొనుగోలు చేసిన ఐరిస్‌ సంస్థ దీన్ని కూల్చివేసి కొత్త భవనాల నిర్మాణానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇది వారసత్వ సంపద జాబితాలో ఉండడంతో కూల్చివేతను అడ్డుకుంటామని ఇంటాక్‌ తెలంగాణ చాప్టర్‌ అధ్యక్షురాలు అనురాధారెడ్డి తెలిపారు.

More Telugu News