Madhya Pradesh: ఆర్టీఐ ద్వారా వివరాలు కోరితే.. 360 జవాబులు పంపిన అధికారులు

  • ఆగస్టు 7న ఆన్‌లైన్‌ ద్వారా ఓ జర్నలిస్టు దరఖాస్తు
  • పోస్టాఫీసు పరిసరాల మార్కెట్‌ విలువ తెలపాలని వినతి
  • ఆగస్టు 13 నుంచి పోస్టుల ద్వారా సమాధానాల వెల్లువ

పలు వివరాలు తెలుసుకోవడం కోసం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు.. అధికారులు 360 సమాధానాలు పంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. సామాజిక కార్యకర్తగానూ పేరు తెచ్చుకున్న జితేంద్ర సూరానా అనే జర్నలిస్టు.. ఆగస్టు 7న ఆర్టీఐకి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేశారు. భోపాల్‌లోని ఓ పోస్టాఫీసు పరిసరాల మార్కెట్‌ విలువతో పాటు రిజిస్ట్రేషన్‌ విలువ తెలపాలని కోరారు. దీంతో ఆగస్టు 13 నుంచి అతడికి పోస్టులు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికి మొత్తం 360 సమాధానాలు వచ్చాయని, అయితే, తాను అడిగిన ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లభించలేదని జితేంద్ర తెలిపారు. పోస్ట్ ఆఫీసు ఉన్న ప్రాంత రిజిస్టర్‌ విలువ చెప్పమని ఆయన కోరితే, ఆ ప్రాంతం 1870 నాటిదంటూ సమాధానం వచ్చింది. ఆ చట్టాన్ని అపహాస్యం చేసేలా అధికారుల తీరు ఉందని జితేంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకుంటే, అందులోనే సమాధానమివ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా పోస్టులో వందల కొద్దీ సమాధానాలు పంపడమేంటని ప్రశ్నించారు. సంబంధింత అధికారుల తీరుపై తాను ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, అయినప్పటికీ వారు సరైన రీతిలో స్పందించలేదని వాపోయారు.

More Telugu News