kidnap: పబ్ జీకి బానిసై కిడ్నాప్ డ్రామా.. తల్లి, పోలీసులను పరుగులు పెట్టించిన కుర్రాడు

  • హైదరాబాద్ లోని శ్రీరాంనగర్‌లో ఘటన
  • ముంబయికి వెళ్లిపోదామనుకున్న కుర్రాడు
  • బస్ మిస్ అవ్వడంతో తల్లికి ఫోన్ చేసి డబ్బు డిమాండ్

పబ్‌ జీకి అలవాటు పడిన ఓ కుర్రాడు.. కిడ్నాప్ డ్రామా ఆడి తన తల్లిని, పోలీసులను పరుగులు పెట్టించిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. పుప్పాలగూడలోని శ్రీరాంనగర్‌లో ఉండే సమీర్‌ ఆర్మన్‌ (16) ఆ ఆటకు బానిసయ్యాడు. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అతడు.. కొంతకాలంగా చదువుపై ఆసక్తి కనబర్చట్లేదు. ఈ విషయాన్ని గుర్తించిన అతడి తల్లి మందలించింది. అయినా వినకపోవడంతో అతడి స్మార్ట్ ఫోన్ ను తీసుకుంది. దీంతో కళాశాలకు వెళ్తున్నానని చెప్పి, శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి, తిరిగి రాలేదు.

ముంబయి వెళ్లి పోదామని నిర్ణయించుకున్న సమీర్ అర్మన్... అదే రోజు రాత్రి ఇమ్లీబన్‌ బస్‌ స్టేషన్‌ కు వచ్చి బస్సు ఎక్కాడు. ప్రయాణంలో తెల్లవారు జామున షోలాపూర్‌లో దిగి బాత్‌ రూమ్‌కు వెళ్లాడు. అయితే, అతడు తిరిగి వచ్చే లోపు బస్సు వెళ్లిపోవడంతో అతడికి ఏం చేయాలో తెలీలేదు. దీంతో అక్కడి బస్టాండ్ లో ఉన్న వారి వద్ద సెల్ ఫోన్ తీసుకొని, తన తల్లికి ఫోన్ చేసి, గొంతు మార్చి మాట్లాడి బెదిరించాడు.

'నీ కుమారుడిని అపహరించాం.. వెంటనే రూ.3 లక్షలు పంపాలి' అంటూ బెదిరించి ఫోను పెట్టేశాడు. అయితే, ఆమె తన కుమారుడి గొంతు గుర్తు పట్టిందో ఏమో.. ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. దీంతో అతడు నిన్న మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు. సాయంత్రం సమయంలో మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌ బుక్‌ చేసుకోవడంతో.. అతడి ఇంట్లో ఉన్న ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో  సమీర్ తల్లి.. చివరకు తన కుమారుడి వ్యవహారంపై  రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. దీంతో మాచర్ల బస్సులో కూర్చున్న అతడిని రాయదుర్గం పోలీసులు పట్టుకుని, నిన్న రాత్రి తల్లికి అప్పగించారు. కాగా, అతడి తండ్రి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు.

More Telugu News