South Africa: హమ్మయ్య... దక్షిణాఫ్రికా ఆలౌటైంది!

  • వీడిన కేశవ్ మహరాజ్, ఫిలాండర్ భాగస్వామ్యం
  • 109 పరుగులు జోడించిన సఫారీ టెయిలెండర్లు
  • భారత్ కు 326 పరుగుల ఆధిక్యం
  • ఫాలో ఆన్ లో సఫారీలు
  • టీమిండియానే బ్యాటింగ్ చేసే అవకాశం

పూణే టెస్టులో భారత్ ను విసిగించిన సఫారీ టెయిలెండర్లు ఎట్టకేలకు అవుటయ్యారు. దాంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 275 పరుగులకు ఆలౌటైంది. అయితే, టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 326 పరుగులు వెనుకబడడంతో ఫాలోఆన్ ప్రమాదంలో పడింది. కానీ, ఈ టార్గెట్ దక్షిణాఫ్రికాకు సరిపోదని భావిస్తున్న టీమిండియా మరోసారి బ్యాటింగ్ చేసి 450 ప్లస్ టార్గెట్ ఇవ్వాలని భావిస్తోంది. అందుకే దక్షిణాఫ్రికాకు వెంటనే బ్యాటింగ్ ఇవ్వకుండా రేపు ఉదయం తానే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అంతకుముందు, వెర్నాన్ ఫిలాండర్ (44 నాటౌట్), కేశవ్ మహారాజ్ (72) జోడీ భారత బౌలర్లను విశేషంగా ప్రతిఘటించింది. దక్షిణాఫ్రికా టాపార్డర్ ను ఎంతో సులువుగా పెవిలియన్ పంపిన భారత బౌలర్లు ఈ జోడీని విడదీయడానికి ఏకంగా రెండు సెషన్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. అలాగని వీరిద్దరూ పక్కా బ్యాట్సమన్లేమీ కాదు. కానీ పిచ్ ను బాగా అర్థం చేసుకుని పాతుకుపోయారు.

షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్, అశ్విన్, జడేజా తమ అమ్ములపొదిలో ఉన్న అన్ని అస్త్రాలను వీరిపై ప్రయోగించాల్సి వచ్చింది. చివరికి కేశవ్ మహరాజ్ ను అశ్విన్ అవుట్ చేయడంతో సుదీర్ఘమైన 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత రబాడా (2)ను కూడా అశ్విన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కు తెరపడింది. భారత బౌలర్లలో అశ్విన్ కు 4 వికెట్లు దక్కగా, ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. షమీ 2 వికెట్లు పడగొట్టగా, జడేజా ఓ వికెట్ తీశాడు.

More Telugu News