Narendra Modi: భారత్, చైనా బంధంలో కొత్త శకానికి ఇది నాంది: ప్రధాని మోదీ

  • చైనా అధ్యక్షుడితో మోదీ అనధికార భేటీ
  • చెన్నై ఓ చారిత్రక నగరమన్న ప్రధాని
  • విభేదాలు వివాదాలుగా మారే అవకాశాన్ని ఇవ్వబోం

చెన్నై ఓ చారిత్రక నగరమని, సంస్కృతి, వాణిజ్యాల పరంగా చాలా కాలంగా  చైనా, భారత్ లను కలుపుతోందని ప్రధాని మోదీ అన్నారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మోదీ మరోసారి అనధికార సదస్సులో చర్చించారు. ఇందులో విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... 'గతేడాది చైనాలోని వూహాన్ లో జరిగిన సదస్సు ఇరు దేశాల మధ్య సత్సంబంధాల విషయంలో కొత్తగా నమ్మకాన్ని, కదలికను తీసుకొస్తే, ఈ రోజు చెన్నై సమావేశం ఇరు దేశాల బంధంలో కొత్త శకానికి నాంది పలికింది' అని తెలిపారు.

'ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారే అవకాశాన్ని ఇవ్వకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇరు దేశాల అంశాలపై పరస్పరం సున్నితంగా వ్యవహరించాలని నిర్ణయించాం. భారత్, చైనాల మధ్య బంధం ప్రపంచ శాంతి, స్థిరత్వాలకు ఉపయోగపడుతుంది' అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జిన్ పింగ్ మాట్లాడుతూ... భారత్ ఇస్తున్న ఆతిథ్యం పట్ల తాము హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇది తమకు ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని చెప్పారు.

More Telugu News