cyberabad: దొంగల రాకతో అప్రమత్తం.. ఇరుగుపొరుగు వారికి సమాచారమిచ్చి పోరాడిన మహిళ

  • మొయినాబాద్‌లో ఘటన
  • దొంగల రాకను చుట్టుపక్కల వారికి ఫోన్‌లో తెలియజేసిన మహిళ
  • ఆగంతకుల దాడిలో గాయపడిన బాధితురాలు

అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడేందుకు దొంగలు తలుపులు బద్దలుగొడుతుంటే ఒంటరిగా ఉన్న ఆ మహిళ హడలిపోలేదు. వెంటనే అప్రమత్తమై ఫోన్‌లో చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చింది. ఈలోగానే వారు ఇంట్లోకి చొరబడడంతో ప్రాణాలను పణంగా పెట్టి వారితో పోరాడింది. వారి దాడిలో ఆమె గాయపడినా.. అప్పటికే సమాచారం అందుకున్న చుట్టుపక్కల వారు రావడంతో దొంగలు తోక ముడిచారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మొయినాబాద్‌లో గురువారం రాత్రి జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సైదా సుల్తానా (55) ఇద్దరు కుమారులు, కోడళ్లతో కలిసి మూడు నెలల క్రితం మొయినాబాద్‌ వచ్చారు. మండలంలోని పెద్దమంగళారం పరిధిలోని సిరిమల్లె కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గురువారం ఆమె కొడుకులు, కోడళ్లు బయటకు వెళ్లడంతో సుల్తానా ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అదే రోజు రాత్రి ఆమె ఇంటికి కన్నం వేసేందుకు దొంగలు ప్రయత్నించారు. 

తలుపులు బద్దలుగొడుతూ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఆ శబ్దాలకు మేల్కొన్న సుల్తానా.. దొంగలు పడ్డారని గుర్తించారు. వెంటనే తన ఫోన్‌లో చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. ఈ లోగానే దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సుల్తానా వారితో తలపడింది. ఈ క్రమంలో  ఓ దొంగ కుర్చీతో ఆమెపై దాడిచేయడంతో ఆమె స్పృహతప్పి కిందపడిపోయింది.

అయితే, అప్పటికే సుల్తానా నుంచి సమాచారం అందుకున్న ఇరుగుపొరుగువారు ఇంటివైపు వస్తుండడంతో గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామానికే చెందిన ముగ్గురు అనుమానితులను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. 

More Telugu News