punjab: పంజాబ్, పఠాన్‌కోట్‌ల మీదుగా పాక్ డ్రోన్లు.. హై అలర్ట్

  • సరిహద్దులో సంచరిస్తున్న పాక్ డ్రోన్లు
  • భారత భూభాగంలో ఆయుధాలు, మందుగుండు జారవిడుస్తున్న వైనం 
  • సరిహద్దులో అణువణువు తనిఖీ చేస్తున్న పోలీసులు

పంజాబ్, పఠాన్‌కోట్‌ల మీదుగా పాకిస్థాన్ డ్రోన్లు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పంజాబ్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా సరిహద్దులో డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పాకిస్థాన్ నుంచి వచ్చినవేనని అనుమానిస్తున్నారు. సరిహద్దు దాటి వస్తున్న డ్రోన్లు భారత భూభాగంలో ఆయుధాలు, నకిలీ నోట్లు, మందుగుండు, డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వాటి కోసం సరిహద్దులో విస్తృత గాలింపు చేపట్టారు.

హిమాచల్‌ప్రదేశ్ అటవీ ప్రాంతంలో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అణువణువు గాలిస్తున్నారు. ఇళ్లు, నివాస ప్రాంతాలతోపాటు ఆ ప్రాంతం గుండా ప్రయాణించే వ్యక్తుల గుర్తింపు కార్డులను కూడా తనిఖీ చేస్తున్నారు. పంజాబ్-హిమాచల్‌ప్రదేశ్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతాయని ఈ ఆపరేషన్‌తో సంబంధం ఉన్న పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

More Telugu News