Ethiopian Prime Minister: ఇథియోపియా ప్రధానికి ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ శాంతి పురస్కారం

  • అబీ అహ్మద్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ను ప్రకటించిన జ్యూరీ
  • ఎరిత్రియాతో స్నేహం, శాంతిని నెలకొల్పిన అబీ
  • డిసెంబర్ 10న పురస్కారం ప్రదానం 

ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్ శాంతి బహుమతి ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ను వరించింది. నోబెల్ అవార్డుల కమిటీ ఈ రోజు అబీ అహ్మద్ కు శాంతి పురస్కారాన్ని ప్రకటించింది. ఇథియోపియాకు, ఎరిత్రియాకు మధ్య ఉన్న సమస్యను పరిష్కరించడంలో ఆయన చేసిన కృషికి గాను పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపింది. శాంతిని నెలకొల్పేందుకు, ఎరిత్రియాతో ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఆయన తీసుకున్న చర్యలు చాలా ఘనమైనవని జ్యూరీ ప్రశంసించింది.

సరిహద్దుకు సంబంధించి ఎరిత్రియా-ఇథియోపియాకు మధ్య 1998 నుంచి 2000 వరకు యుద్ధం జరిగింది. గత ఏడాది జూలైలో మళ్లీ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి అబీ చాలా కృషి చేశారు. నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న ఆయనకు శాంతి పురస్కారాన్ని అందజేయనున్నారు.

More Telugu News