Ranbasy: ఫ్రాడ్ కేసులో రాన్ బాక్సీ సింగ్ సోదరుల అరెస్ట్

  • శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ అరెస్ట్
  • డైచీని మోసం చేసిన కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

ఫార్మా దిగ్గజం రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, అతని సోదరుడు మల్వీందర్ సింగ్ లను ఫ్రాడ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 740 కోట్ల నిధుల దుర్వినియోగం, ఫ్రాడ్ కేసులో పంజాబ్ లోని లుధియానాలో నిన్న సాయంత్రం శివీందర్ సింగ్ ను, ఈ ఉదయం మల్వీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. గత ఆగస్టులోనే వీరిపై ఈడీ దాడులు జరిగాయి.

తమ సంస్థకు చెందిన రూ. 740 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని రెలిగేర్ ఫిన్ వెస్ట్ వారిపై గత డిసెంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన ఐదు నెలల తర్వాత ఈ సోదరులపై చీటింగ్, ఫ్రాడ్, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో, వీరిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది.

తమ తండ్రి స్థాపించిన మల్టీ బిలియన్ డాలర్ రాన్ బాక్సీ సంస్థకు ఈ సోదరులిద్దరూ వారసులుగా ఉన్నారు. 2008లో ఈ సంస్థను జపాన్ కు చెందిన డైచీకి వీరు అమ్మేశారు. అయితే, సంస్థను అమ్మే ముందు కొన్ని విషయాలను దాచిపెట్టి, మోసం చేశారంటూ సింగపూర్ లోని ట్రైబ్యునల్ ను డైచీ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో, డైచీకి రూ. 2,562 కోట్లను చెల్లించాలంటూ 2016లో ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈ ఆదేశాలను 2017లో ఢిల్లీ హైకోర్టులో సింగ్ సోదరులు సవాల్ చేశారు. అయితే, ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పును వెలువరించింది.

More Telugu News