Aravind Kejriwal: విదేశీ సదస్సుకు హాజరవ్వాలనుకున్న కేజ్రీవాల్.. కుదరదన్న కేంద్రం!

  • డెన్మార్క్ లో క్లయిమేట్ సదస్సు
  • అనుమతించని విదేశాంగ శాఖ 
  • కస్సుమన్న ఆమ్ ఆద్మీ పార్టీ

విదేశాల్లో పర్యటించి రావాలన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. వాతావరణ మార్పులపై డెన్మార్క్‌ లో జరుగుతున్న సీ –40 క్లయిమేట్ సమ్మిట్ కు వెళ్లాలని కేజ్రీవాల్ భావించగా, ఆయన పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు తెలిపాయి. దాంతో కేజ్రీవాల్ తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. వాస్తవానికి ఈ పాటికే కేజ్రీవాల్ కోపెన్‌ హెగన్‌ కు చేరుకోవాల్సి వుంది.

 కాగా, కేంద్రం నిర్ణయంతో అంతర్జాతీయంగా భారత ప్రతిష్ఠ దెబ్బతిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అంటే కేంద్రానికి అంత కోపం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇదిలావుండగా, ఈ సదస్సు కేవలం మేయర్ల స్థాయి ప్రతినిధులకు మాత్రమే కాబట్టి, కేజ్రీవాల్ పర్యటనకు అనుమతించలేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.

More Telugu News