Kurnool District: రక్తసిక్తమైన దేవరగట్టు కర్రల సమరం.. 50 మందికిపైగా గాయాలు

  • ఇలవేల్పును దక్కించుకునేందుకు కర్రలతో తలపడే గ్రామస్థులు
  • అనాదిగా వస్తున్న ఆచారం
  • ఫలితమివ్వని అవగాహన కార్యక్రమాలు

కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో జరిగే కర్రల సమరం నిన్న రక్తసిక్తమైంది. దాదాపు 50 మంది గాయపడగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ ఇలవేల్పును దక్కించుకునేందుకు ఏటా విజయదశమి రోజున ఐదు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడడం ఆచారంగా వస్తోంది. నిన్న జరిగిన కర్రల సమరం హోరాహోరీగా సాగింది. ఇలవేల్పు కోసం కర్రలతో తలపడి ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.

ఈ ఆచారం హింసాత్మకంగా ఉండడంతో దీనిని నివారించేందుకు గత కొంతకాలంగా పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, లఘు చిత్రాలు ప్రదర్శించడం వంటి అవగాహన కార్యక్రమాలను నెల రోజుల ముందు నుంచే చేపట్టినప్పటికీ సమరాన్ని మాత్రం నిలువరించలేకపోయారు. దీంతో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్ వాహనాలతో నిఘా పెట్టారు. వెయ్యిమందికి పైగా పోలీసులను మోహరించి పరిస్థితిని క్షణక్షణం పర్యవేక్షించారు.

More Telugu News