Kerala: కేరళ సీరియల్ కిల్లర్ జాలీ అమాయకురాలంటున్న సన్నిహితులు!

  • కేరళలో వరుస హత్యలు
  • 14 ఏళ్లలో ఆరుగురి హత్య
  • జాలీ అనే గృహిణి హంతకురాలంటున్న పోలీసులు

కేరళలో ఓ మహిళ ఆరుగుర్ని హత్య చేసిందన్న కథనాలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. జాలీ అనే మహిళ 14 ఏళ్లలో ఈ వరుస హత్యలకు పాల్పడిందని, హత్యల కోసం ప్రమాదకర విష పదార్థం సైనేడ్ ఉపయోగించిందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. జాలీ హతమార్చినవారిలో భర్త, రెండేళ్ల పాప కూడా ఉండడంతో ఆమె ఎంత కర్కోటకురాలో అని ప్రచారం జరుగుతోంది.

అయితే, జాలీ ఓ సైకో అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తుండగా, జాలీ వంటి అమాయకురాలు ఇంకెవరూ ఉండరని సన్నిహితులు అంటున్నారు. ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా ఉండే జాలీని ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని సన్నిహితులు, బంధువులు ఆరోపిస్తున్నారు.

అపరిచితుడు చిత్రంలో రామం, రెమో తరహాలో జాలీలో కూడా స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉండొచ్చని, ఓవైపు మామూలు గృహిణిగా ఉంటూనే, మరోవైపు కరడుగట్టిన హంతకురాలిగా ఒక్కొక్కరిని అంతమొందించి ఉంటుందన్నది పోలీసుల వాదన! మరోవైపు జాలీ తనయుడు రెమో థామస్ (21) తన తల్లి ఓ హంతకురాలంటే నమ్మలేకపోతున్నాడు. అయితే ఆధారాలన్నీ జాలీనే దోషిగా చూపిస్తుండడంతో ఇంకేమీ మాట్లాడలేకపోతున్నాడు. కాగా, పోలీసులు ఈ కేసులో ఓ మానసిక వైద్యుడి సాయం తీసుకుని జాలీ మనస్తత్వాన్ని విశ్లేషించాలని భావిస్తున్నారు.

More Telugu News