Stary Dog: కుక్కను యాక్సిడెంట్ చేసినందుకు... హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ అరెస్ట్!

  • కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు దాటుతున్న కుక్క
  • యాక్సిడెంట్ తరువాత ఆపకుండా వెళ్లిన డ్రైవర్
  • స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో అరెస్ట్

కారును అత్యంత వేగంగా నడుపుతూ వచ్చి, ఓ వీధి కుక్క మరణానికి కారణమైన క్యాబ్ డ్రైవర్ ను హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, అబ్దుల్ నయీమ్ (24) అనే క్యాబ్ డ్రైవర్, కేబీఆర్‌ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ వైపు వేగంగా వెళుతుండగా, ఫుట్‌ పాత్‌ వైపు నుంచి ఓ వీధికుక్క రోడ్డు దాటుతోంది. ఆ కుక్కను నయీమ్ కారు కొట్టింది. ఆపై కారును ఆపకుండా వెళ్లిపోయాడు. ఆ శునకం అక్కడికక్కడే చనిపోయింది.

అయితే, ఈ ఘటనను స్వచ్ఛంద సంస్థ కంపాసియోనేట్‌ సొసైటీ ఫర్‌ యానిమల్స్‌ వాలంటీర్ అజయ్ చూశాడు. కారును వెంటనే వెంబడించాడు. కారును ఓవర్ టేక్ చేసి, అతన్ని పట్టుకుని, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు తెచ్చాడు. ఈలోగా వీధి కుక్క మరణానికి కారణం కావడం, నిర్లక్ష్యంగా కారును నడపడంపై సదరు సంస్థ చైర్మన్ ప్రవల్లిక ఫిర్యాదు చేశారు. దీంతో నయీమ్ పై ఐపీసీ సెక్షన్‌ 429, సెక్షన్‌ 11 (1) (ఏ) (ఎల్‌), ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాల్టీ యానిమల్‌ యాక్ట్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

More Telugu News