Kannababu: మరణించిన రైతుల వారసులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తాం: మంత్రి కన్నబాబు

  • రైతు భరోసా అర్హుల ఎంపికపై స్పందించిన మంత్రి
  • అర్హుల జాబితా తయారీ వేగంగా సాగుతోందని వెల్లడి
  • 42 లక్షల మంది లబ్దిదారులున్నారన్న మంత్రి

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు రైతు భరోసా లబ్దిదారుల ఎంపికపై స్పందించారు. రైతు భరోసా పథకం అర్హుల జాబితా తయారు చేసే ప్రక్రియ వేగంగా సాగుతోందని తెలిపారు. పీఎం కిసాన్ యోజన పథకం కింద 42 లక్షల మంది లబ్దిదారులు ఉన్నట్టు వెల్లడించారు. అయితే ఆ పథకంలో లక్షల సంఖ్యలో అనర్హులు ఉన్నట్టు గుర్తించినట్టు వివరించారు. మరణించిన రైతుల వారసులకు కూడా రైతు భరోసా వర్తింపచేయాలని నిర్ణయించినట్టు కన్నబాబు తెలిపారు. మృతి చెందిన రైతుల వారసులు 1.07 లక్షల మంది ఉన్నారని చెప్పారు.

లబ్దిదారులు, అనర్హుల జాబితాను వేర్వేరుగా ప్రదర్శిస్తామని, ఆదాయపన్ను చెల్లించే 1.5 లక్షల మంది రైతులు అనర్హులుగా తేలిందని వెల్లడించారు. అదేసమయంలో భూములున్న 21 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. కౌలు రైతుల విషయానికొస్తూ, రాష్ట్రంలో 15.5 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయని తెలిపారు. ఆధార్ సీడింగ్, ప్రజాసాధికార సర్వేతో లబ్దిదారుల వివరాలు పరిశీలిస్తున్నామని, 4.2 లక్షల ఆధార్ కార్డులు భూముల వివరాలకు సరిపోలడం లేదని అన్నారు.

More Telugu News