Telangana: ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కార్మికుల గుండెల్లో గునపాలు గుచ్చారు!: కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్

  • కార్మికులతో పెట్టుకోవడమంటే అగ్గితో గోక్కోవడమే
  • ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ యూటర్న్ తగదు
  • కేసీఆర్ తీరు ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతోంది

కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్ వారి గుండెల్లో గునపాలు గుచ్చారని టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్ అనేక మాయమాటలు చెప్పారని, ఆయన హామీలు నీటిమూటల్లా మారాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిదని అన్నారు.

 ఆర్టీసీ కార్మికులతో పెట్టుకోవడమంటే అగ్గితో గోక్కోవడమేనని, వారికి అండగా బీజేపీ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇస్తామని చెప్పిన కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారని, ఆయన తీరు ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చే జీతాలు కేసీఆర్ తన ఇంట్లో నుంచి ఇస్తున్నారా? అని ప్రశ్నించిన లక్ష్మణ్, జీతాలు తీసుకోవడం కార్మికుల హక్కు అని చెప్పారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఆర్టీసీ నష్టాలు వచ్చాయని, ఆ నష్టాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

More Telugu News