Uddhav Thackeray: దానికి అర్థం నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు కాదు: ఉద్ధవ్ థాకరే

  • తిరిగి అధికారంలోకి రావడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం
  • మహారాష్ట్ర కోసమే మేము ఆ పని చేశాం
  • దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీచినప్పుడు కూడా ఆ పార్టీకి చెక్ పెట్టాం

మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ... తిరిగి అధికారంలోకి రావడానికే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. తమ పార్టీ అధికార పత్రిక 'సామ్నా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఒక సంకల్పం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. పొత్తు పెట్టుకునే సమయంలో తాము ఎంతో పరిణతితో వ్యవహరించామని అన్నారు. బీజేపీతో పొత్తు విషయంలో తాము రాజీ పడ్డామని... మహారాష్ట్ర కోసమే తాము ఆ పని చేశామని తెలిపారు.

తన కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాడంటే... దానికి అర్థం రాజకీయాల నుంచి తాను రిటైర్ అవుతున్నట్టు కాదని ఉద్ధవ్ అన్నారు. రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా ఉంటానని స్పష్టం చేశారు. 2014లో దేశ వ్యాప్తంగా మోదీ గాలి వీచిందని... ఆ సమయంలో కూడా బీజేపీకి శివసేన చెక్ పెట్టిందని... అయితే, ఆ సమయంలో బీజేపీకి దూరంగా శివసేన ఎందుకుందన్న విషయంపై ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను శివసేన 124 స్థానాల్లో పోటీ చేస్తోందని... కొన్ని స్థానాలను ఇతర మిత్ర పక్షాలకు బీజేపీ కేటాయించిందని తెలిపారు. ఏదో ఒక రోజు శివసైనికుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడనే మాటను తన తండ్రి బాల్ థాకరేకు ఇచ్చానని వెల్లడించారు.

More Telugu News