Dasara: ఉగ్రరూపంలో దర్శనమిస్తున్న అమ్మలగన్నయమ్మ!

  • నేడు మహర్నవమి
  • సింహవాహనంపై మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ
  • కిటకిటలాడుతున్న ఆలయాలు

సింహవాహనంపై, చేతిలో త్రిశూలం ధరించి, మహిషాసురుడిని హతమారుస్తున్న అవతారంలో నేడు కనకదుర్గమ్మ భక్తులకు ఉగ్రరూపంలో దర్శనమిస్తోంది. మహర్నవమి సందర్భంగా అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అమ్మను అలంకరించారు. దేవతలందరి శక్తులనూ తనలో నిక్షిప్తం చేసుకుని, గొప్ప తేజస్సుతో ప్రకాశించే, ఈ తల్లి అనుగ్రహం కలిగితే దేన్నైనా సాధించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. అసాధారణమైన శక్తి కలిగిన మహిషుడిని ఒంటరిగా ఎదుర్కొన్న జగన్మాత, తొమ్మిది రోజుల పాటు పోరాడి, రోజుకో రూపంలో యుద్ధం చేసి విజయం సాధించినట్టు ఎన్నో హిందూ పురాణాల్లో ఉంది.

ఇక దసరా పర్వదినాల్లో రెండో రోజైన నేడు, తెలుగు రాష్ట్రాల్లోని వేలాది దేవాలయాలు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. నేడు ఆయుధపూజ కూడా ఉండటంతో, ఆలయాల వద్ద సందడి నెలకొంది. తమతమ వాహనాలను దేవాలయాల వద్దకు తీసుకు వచ్చిన భక్తులు, వాటిని అలంకరించి, పూజలు చేయిస్తున్నారు. ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం విజయవాడ, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకునే సామాన్య భక్తులకు దర్శనానికి 3 గంటల వరకూ సమయం పడుతుండగా, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిని దర్శించుకునేందుకు గంటన్నర వరకూ సమయం పడుతోంది.

More Telugu News