Team India: టెస్టు చాంపియన్ షిప్ లో ఎవరికీ అందనంత ఎత్తులో టీమిండియా

  • వరల్డ్ కప్ అనంతరం మొదలైన టెస్టు చాంపియన్ షిప్
  • వరుసగా మూడు టెస్టుల్లో టీమిండియా జయభేరి
  • కోహ్లీ సేన ఖాతాలో 160 పాయింట్లు

విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టెస్టు క్రికెట్ లో అద్వితీయంగా రాణిస్తోంది. వైజాగ్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచే అందుకు నిదర్శనం. అన్ని రంగాల్లోనూ రాణించి సఫారీలను 203 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ షురూ అయింది. ఇక మీదట ఆయా దేశాలు ఆడే టెస్టు మ్యాచ్ లు వరల్డ్ చాంపియన్ షిప్ లో భాగంగానే నిర్వహిస్తారు. ఈ క్రమంలో చాంపియన్ షిప్ మొదలయ్యాక భారత్ ఆడిన 3 టెస్టుల్లోనూ ఘనవిజయం సాధించింది. ఇటీవలే విండీస్ గడ్డపై రెండు టెస్టుల్లోనూ జయభేరి మోగించిన భారత్, ఇప్పుడు సొంతగడ్డపైనా అదే ఒరవడి కొనసాగించింది. తద్వారా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 160 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో ద్వితీయస్థానంలో ఉన్న న్యూజిలాండ్ కు, టీమిండియాకు మధ్య 100 పాయింట్ల అంతరం ఉంది. కివీస్ ఖాతాలో 60 పాయింట్లే ఉన్నాయి. అటు శ్రీలంక కూడా 60 పాయింట్లు సాధించింది. బలమైన టెస్టు జట్లుగా పేరుగాంచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ జాబితాలో 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇటీవలే యాషెస్ లో భాగంగా 5 టెస్టులాడిన ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక, టెస్టు వరల్డ్ చాంపియన్ షిప్ మొదలయ్యాక పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇప్పటివరకు మ్యాచ్ లు ఆడని కారణంగా పాయింట్ల పట్టికలో చివరన నిలిచాయి.

More Telugu News