YSRCP: ఢిల్లీ పర్యటనలో జగన్ మీడియాకు ముఖం చాటేశారు: యనమల రామకృష్ణుడు

  • మోదీని జగన్ కలవడంపై సీఎంఓ మొక్కుబడి ప్రకటన చేసింది!
  • ప్రధానితో సీఎం ఏం చర్చించారో పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి
  • విభజన వల్ల కన్నా వైసీపీ పాలనతో ఏపీకి ఎక్కువ నష్టం జరిగింది 

ఢిల్లీలో ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్ నిన్న కలిసిన విషయం తెలిసిందే. అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడకుండానే తిరిగి ఏపీకి వచ్చేశారు. దీనిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ పర్యటనలో జగన్ మీడియాకు ముఖం చాటేశారని విమర్శించారు. ప్రధానితో సీఎం ఏం చర్చించారో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉందని, ప్రధానితో చర్చల వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. మోదీని జగన్ కలవడంపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) మొక్కుబడిగా పత్రికా ప్రకటన విడుదల చేయడమేంటి? అని ప్రశ్నించారు. విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కన్నా వైసీపీ పాలనతో జరిగిన నష్టం ఎక్కువగా ఉందని విమర్శించారు.

ప్రజల తలసరి ఆదాయం పడిపోవడానికి సీఎం నిర్వాకాలే కారణమని, ఏపీకి పెట్టుబడిదారులు రావట్లేదని ముఖ్యమంత్రి ఇచ్చిన వినతిపత్రంలోనే ఉందని అన్నారు. భారం అంతా కేంద్రంపై నెట్టేసి జగన్ చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.

More Telugu News