Crime News: బిజినెస్‌ మ్యాన్‌ అవతారం...భారీగా చోరీలే వ్యవహారం : కేటుగాడి గుర్తింపు

  • కోట్లలో కొల్లగొట్టిన నిందితుడిని పట్టుకున్న పోలీసులు
  • బెంగళూరులో నివాసం ఉంటూ హైదరాబాద్‌లో దొంగతనాలు
  • నిందితుడితోపాటు సహకరించిన వ్యక్తి విచారణ

ఖరీదైన కారు...సూటూ బూటూ...వ్యాపారం పనిమీద వచ్చినట్టు బిల్డప్‌. ఖరీదైన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడి చెక్కేయడం...బెంగళూరులో ఉంటూ హైదరాబాద్‌లోని ధనికుల ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న కేటుగాడిని హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ముఠా నాయకుడు ఇర్ఫాన్‌ (32)తోపాటు అతనికి సహకరించిన ముజాహిద్‌ అనే మరో నేరస్థుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు-2లో నివాసం ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి సోదరుడి కుమారుడు ఉత్తమ్‌రెడ్డి ఇంట్లో కొన్నిరోజుల క్రితం చోరీ జరిగి రూ.3 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరణకు గురైన విషయం తెలిసిందే.

అలాగే, జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 28లోని విల్లామేరీ కళాశాల యజమాని డాక్టర్‌ ఫిలోమినా నివాసంలోను భారీ చోరీ జరిగింది. ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరో వ్యాపారి ఇంట్లోను కోట్లు దోచుకెళ్లారు. ఈ అన్ని దొంగతనాలకు పాల్పడింది ఇర్ఫాన్‌ ముఠాయేనని పోలీసులు గుర్తించారు.

బీహార్‌ రాష్ట్రం జోగియా ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌ పదేళ్ల క్రితం పనికోసం ముంబై వెళ్లాడు. అక్కడ ఉండలేక హైదరాబాద్‌ వచ్చేసి తలాబ్‌కట్టలో బ్యాగు కుట్టే ఓ వ్యక్తి వద్ద పనికి కుదిరాడు. చాలాఏళ్లు పనిచేశాక హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. రెండేళ్ల తరువాత మళ్లీ బ్యాగులు కుట్టే గురువు వద్దకు వచ్చాడు. కాకపోతే ఈసారి విలాసవంతమైన కారులో, సూటూబూటుతో దిగాడు.

వ్యాపారస్తుడిగా మారానని అతన్ని నమ్మించి ముజాహిద్‌తో కలిసి వచ్చినప్పుడల్లా అతని ఇంట్లోనే మకాం పెట్టేవాడు. చోరీకి పాల్పడేవాడు. వెళ్లేటప్పుడు గురువుకు రూ.10 వేలు ఇచ్చేవాడు. హైదరాబాద్‌ నుంచి మాయమయ్యాక ఇర్ఫాన్‌, ముజాహిద్‌తో కలిసి ముంబయి, ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. ముఖానికి ముసుగు వేసుకుని పనులు చక్కబెట్టేవారు. అక్కడి పోలీసు రికార్డుల్లో తరచూ పేరు చేరి వేట మొదలు కావడంతో బెంగళూరుకు మకాం మార్చారు.

కొన్ని నెలల క్రితం బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని వైద్యుడు రామారావు ఇంట్లో చోరీ సందర్భంగా సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన పోలీసులకు పక్క సందులో ఖరీదైన కారు కనిపించింది. ఆ కారులోనే నిందితులు వచ్చి ఉంటారని పోలీసులు అనుమానించారు. అలా దొరికిన తీగతో కూపీలాగారు. తలాబ్‌కట్టలోని ఇర్ఫాన్‌ గురువుతోపాటు అతని బావమరిదిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం విషయం వెల్లడైతే ఇర్ఫాన్‌ చోరీల చిట్టా బయటపడే అవకాశం ఉంది.

More Telugu News