lalitha jewellers: లలిత జ్యువెలరీ చోరీ కేసు.. సూత్రధారి బాలమురుగన్ గురించి తెలిసి విస్తుపోతున్న పోలీసులు!

  • కోటీశ్వరుడు కావాలన్నదే లక్ష్యం
  • చోరీ చేసిన సొమ్ముతో సినిమాల నిర్మాణం
  • హైదరాబాద్‌లో సొంతిల్లు

తిరుచ్చిలోని లలిత జ్యువెల్లర్స్‌లో జరిగిన భారీ చోరీ కేసు ప్రధాన సూత్రధారి బాల మురుగన్ గురించి తెలిసిన విషయాలు పోలీసులనే విస్తుపోయేలా చేస్తున్నాయి. కోటీశ్వరుడు కావాలన్న ఒకే ఒక లక్ష్యంతో మురుగన్ చోరీల బాట పడ్డాడు. లలిత జ్యువెల్లర్స్ కేసులో ఓ నిందితుడు పోలీసులకు చిక్కగా పరారైన సరేశ్.. బాలమురుగనేనని పోలీసులు తెలిపారు. కోటీశ్వరుడిని కావాలన్న తపన అతడిని అడ్డదారులు తొక్కించింది.  

గోడలకు కన్నాలు వేసి చోరీ చేయడంలో సిద్ధహస్తుడైన మురుగన్ బ్యాంకులు, ఏటీఎంలలో పలుమార్లు చోరీలకు పాల్పడ్డాడు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. 18 ఏళ్లకే సొంత ఇంట్లోని టేప్‌రికార్డును చోరీ చేయడంతో అతడి చోరీల ప్రస్థానం మొదలైంది. 2008లో ఓ ముఠాను ఏర్పాటు చేసి బెంగళూరులో భారీ చోరీ చేశాడు. 2011లో బెంగళూరులో అరెస్టై బయటకొచ్చాడు. తర్వాత హైదరాబాద్ చేరుకుని ఇల్లు కొన్నాడు.

సినిమాలంటే పడిచచ్చే మురుగన్.. రూ.50 లక్షలతో ‘బాలమురుగన్ ప్రొడక్షన్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ‘మనసా వినవే’ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమాలో అక్కడ కొడుకు సురేశ్‌కు చాన్స్ ఇచ్చాడు. ఓ చోరీ కేసులో 2016లో చిత్తూరు జిల్లాలోని సత్యవేడు పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ‘ఆత్మ’ అనే మరో సినిమాను నిర్మించాడు. 2014 నవంబరులో చిత్తూరు జిల్లా వరదయ్యపాళ్యంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో రూ.2 కోట్ల నగదు, నగలు దొంగిలించాడు.

అదే ఏడాది తెలంగాణలోని ఘట్‌కేసర్‌ గ్రామీణ బ్యాంకులో రూ.35 లక్షలు చోరీ చేశాడు. 2015లో హైదరాబాద్‌లో అరెస్టయ్యాడు. 2017లో మురుగన్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు ఏకంగా 5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న మురుగన్ నడవలేని స్థితిలో ఉన్నాడు. ఓ వ్యాన్‌లో సంచార జీవితం గడుపుతున్నాడు.

More Telugu News