PMC: పీఎంసీ బ్యాంకులో రూ. 6,500 కోట్ల కుంభకోణం... మాజీ ఎండీ అరెస్ట్!

  • మొత్తం ఆరు ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు
  • హెచ్డీఐఎల్ ప్రమోటర్ల ఇళ్ల నుంచి కీలక పత్రాలు స్వాధీనం
  • పీఎంసీ మాజీ ఎండీ జాయ్ థామస్ అరెస్ట్

సుమారు రూ. 6,500 కోట్ల కుంభకోణంలో పీఎంసీ (పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్) బ్యాంకు మాజీ ఎండీ జాయ్ థామస్ ను ఆర్థిక నేరాల విభాగం అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. పీఎంసీ మాజీ బోర్డు సభ్యులు, హెచ్డీఐఎల్ (హౌసింగ్ డెవలప్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) సీనియర్ ఉద్యోగులపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదు చేసిన రోజునే జాయ్ థామస్ అరెస్ట్ కావడం గమనార్హం. ఈ కుంభకోణం గతంలోనే వెలుగులోకి రాగా, అప్పట్లో మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న థామస్ ను, బ్యాంకు బోర్డు విధుల నుంచి సస్పెండ్ చేసింది.

తాజాగా, మొత్తం ఆరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ, ఎకనామిక్ అఫెన్స్ వింగ్ అధికారులు, హెచ్డీఐఎల్ మాజీ చైర్మన్లు, ప్రమోటర్ల ఇళ్ల నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గతంలో అరెస్ట్ అయిన హెచ్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ రాకేశ్ వాధ్వాన్, సారంగ్ వాధ్వాన్ లు 9 వరకూ పోలీసు కస్టడీలో వుంటారు. పీఎంసీ బ్యాంకు ఇచ్చిన మొత్తం రుణాల్లో 75 శాతం దివాలా తీసిన హెచ్డీఐఎల్ కే వెళ్లాయి.

ఇద్దరు హెచ్డీఐఎల్ ప్రమోటర్లు, తప్పుడు దస్త్రాలను సృష్టించి, 21 వేల ఫేక్ ఖాతాల ద్వారా పీఎంసీ నుంచి రుణాలను పొందారన్నది ప్రధాన ఆరోపణ. బ్యాంకు వార్షిక నివేదికల్లో సైతం హెచ్డీఐఎల్ కు ఇచ్చిన రుణాల వివరాలను పొందుపరచలేదు. హెచ్డీఐఎల్ దివాలా తీసిన తరువాత కూడా ఆ సంస్థకు పీఎంసీ రుణాలను మంజూరు చేస్తూ వెళ్లడం గమనార్హం.

More Telugu News