TSRTC: ఎంతమంది ఉద్యోగులను తీసేస్తారో మేమూ చూస్తాం.. తగ్గే ప్రసక్తే లేదు: తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ

  • కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
  • ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరించిన ప్రభుత్వం
  • ఎంత మందిని తొలగిస్తారో చూస్తామన్న యూనియన్ల జేఏసీ

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. గత అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లో చేరాలని... విధుల్లో చేరని ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ ఆర్మీసీ కార్మికులు ఏమాత్రం తగ్గలేదు. తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ యూనియన్ల జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ, సమ్మె విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని చెప్పారు. ఎంత మంది ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందో తాము కూడా చూస్తామని అన్నారు. పోరాటాన్ని ఇలాగే కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. మరోవైపు, ప్రైవేట్ వాహనాలను నడిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. ప్రైవేట్ వాహనాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రైవేట్ వాహనాలను పెడుతున్నారని ఆరోపించారు.

More Telugu News