Huzurnagar: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట ఎస్పీపై వేటేసిన ఈసీ!

  • ప్రత్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారంటూ ఎస్పీపై ఆరోపణలు
  • ఎస్పీ వెంకటేశ్వర్లును విధుల నుంచి తప్పించిన ఈసీ
  •  ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా బాలకృష్ణన్ నియామకం

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఇతర పార్టీల నేతలు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లుపై ఎన్నికల సంఘం వేటేసింది. ఆయనను విధుల నుంచి తప్పించడమే కాకుండా ఎటువంటి పోస్టు ఇవ్వకుండా హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. ఆయన స్థానంలో భూపాలపల్లి ఎస్పీ భాస్కర్‌ను నియమించింది.

ఇక, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల విచ్చలవిడి డబ్బు పంపిణీకి అడ్డుకట్ట వేయడంలో సమర్థుడైన బీఆర్ బాలకృష్ణన్‌ను హుజూర్‌నగర్‌కు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా ఈసీ నియమించింది. ఆదాయపు పన్ను శాఖలో బాలకృష్ణన్‌కు ‘సింగం’గా పేరుంది. కర్ణాటకలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కుటుంబాన్ని ముప్పుతిప్పలు పెట్టించింది ఈయనే. శాసనసభ ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బు పట్టుకున్న బాలకృష్ణన్ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి రెండుసార్లు అవార్డులు అందుకున్నారు.

బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్,  రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, మురళీధర్‌రావు, వివేక్‌తో కూడిన బృందం గురువారం సీఈసీ సునీల్‌ అరోరాను కలిసి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని ఫిర్యాదు చేసింది. ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా ఎస్పీ అడ్డుకున్నారని ఆరోపించారు. వారు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే ఎన్నికల సంఘం స్పందించింది. సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లుపై వేటేయడంతోపాటు బాలకృష్ణన్‌ను హుజూర్‌నగర్‌కు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

More Telugu News