Boat: రెండు గంటల్లో బోటు బయటికి తీస్తా... మళ్లీ సవాల్ విసిరిన 'సాహసవీరుడు' శివ!

  • గోదావరిలో బోటు మునక
  • వెలికితీత పనులు ధర్మాడి సత్యం బృందానికి అప్పగింత
  • ఇప్పటికీ దొరకని బోటు ఆచూకీ

కోనసీమ సాహసవీరుడు శివ మరోసారి సవాల్ విసిరాడు. ఈసారి కేవలం రెండు గంటల్లోనే బోటును వెలికితీస్తానంటూ ముందుకొచ్చాడు. కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే పనులు ధర్మాడి సత్యం బృందానికి అప్పగించకముందే శివ తెరపైకి వచ్చాడు. తనపై నమ్మకం ఉంచితే బోటును బయటికి తీస్తానని చెప్పినా, సర్కారు మాత్రం బాలాజీ మెరైన్స్ సంస్థపై నమ్మకం ఉంచింది. అయితే ధర్మాడి సత్యం ఆధ్వర్యంలోని బాలాజీ మెరైన్స్ మూడు రోజుల పాటు శ్రమించినా బోటు ఆచూకీ కనిపెట్టలేకపోయింది. దీనిపై శివ స్పందించాడు.

ఇప్పుడు తనకు అవకాశం ఇచ్చినా రెండు గంటల్లో బోటు ఎక్కడుందో చూపించడమే కాకుండా, వంద శాతం బయటికి తీస్తానని సవాల్ విసిరాడు. తనను బోటు వెలికితీత పనుల్లో ఉపయోగించుకోవాలని సర్కారు ధర్మాడి సత్యం బృందానికి చెప్పినా, వారు తన సేవలను వినియోగంచుకోలేదని శివ మీడియాకు వెల్లడించాడు. తనను బయటే ఉండమని చెప్పి వారు నదిలో ఆపరేషన్ నిర్వహించారని, బోటు ఎక్కడ ఉందో తాను మొదటే మార్కింగ్ చేశానని వివరించాడు. ఒకవేళ తాను బోటును బయటికి తీయలేకపోతే సాహసవీరుడిగా తనకు వచ్చిన అవార్డులన్నిటినీ వెనక్కి ఇచ్చేస్తానని శివ స్పష్టం చేశాడు.

More Telugu News