Revanth Reddy: కేసీఆర్ కు మరో బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

  • టీఆర్టీ పరీక్షలో అర్హత సాధించిన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి
  • ఉప ఎన్నికపై చూపిస్తున్న శ్రద్ధను ఉద్యోగ నియామకాలపై చూపించండి
  • ఆగమేఘాల మీద కేటీఆర్, హరీశ్ లకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు

టీఆర్టీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వెంటనే పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఆర్టీ ఫలితాలను వెల్లడించి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు నియామక ఉత్తర్వులను ఇవ్వలేదని విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ బహిరంగ లేఖను రాశారు. 2017లో టీఆర్టీ భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో తామంతా ఉత్తీర్ణతను సాధించామని, కానీ ఇంతవరకు నియామక ఉత్తర్వులు తమకు అందలేదనే విషయాన్ని బాధితులు తన దృష్టికి తీసుకొచ్చారని లేఖలో పేర్కొన్నారు. నియామక ఉత్తర్వులను ఇస్తారో, లేదో అని అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వానికి యువత పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని చెప్పారు.

స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ పేరుతో నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంటే, తెలంగాణ 14వ స్థానంలో ఉందని రేవంత్ విమర్శించారు. మీ కుటుంబ సౌఖ్యం తప్ప మీకు ఇంకేమీ పట్టదా? అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన, ఉప ఎన్నికపై చూపిస్తున్న శ్రద్ధ ఉద్యోగ నియామకాలపై చూపించాలని సూచించారు.  రాజకీయ నిరుద్యోగులుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావులకు ఆగమేఘాల మీద మంత్రివర్గంలో స్థానం కల్పించారని విమర్శించారు.

More Telugu News