C.Ramachandraiah: ఎక్కడో ఉన్న పోస్టును చదివి వినిపించే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయాడు: సి.రామచంద్రయ్య విమర్శలు

  • టీడీపీ, వైసీపీ మధ్య 'సోషల్ మీడియా వార్'
  • వైసీపీపై ఆరోపణలు గుప్పించిన చంద్రబాబు
  • తీవ్రంగా స్పందించిన వైసీపీ నేతలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ అగ్రనేతలు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్లు తమపై నీచంగా ప్రచారం చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను వారు తప్పుబట్టారు. సోషల్ మీడియా అనేది ఓ కీకారణ్యం అని, అందులో ఎక్కడో ఉన్న ఓ పోస్టును చదివి వినిపించే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని వైసీపీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య విమర్శించారు.

మీడియాను అడ్డుపెట్టుకుని సొంతమామపైనే దుర్మార్గంగా దుష్ప్రచారం చేయించిన ఘనత చంద్రబాబుదని, నీచ సంస్కృతికి చంద్రబాబు మర్రి విత్తనంలాంటి వాడని అభివర్ణించారు. గత 10 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబీకులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయించేందుకు టీడీపీ ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసుకుందని, అందుకోసం 2000 మందిని నియమించుకున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. ఈ కార్యకలాపాలకు హైదరాబాద్ లోని ఎన్ బీకే బిల్డింగ్, విజయవాడలోని సోషల్ మీడియా ఆఫీస్ వేదికలని తెలిపారు.

సీఎం జగన్ చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక, ప్రజలకు ఏమాత్రం సంబంధంలేని విషయాలను చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అటు, మంత్రి బొత్స కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతి అంశాన్ని వాడుకోవాలని చూడడం చంద్రబాబుకు తగదని హితవు పలికారు.

More Telugu News