Ravi Shastri: రవిశాస్త్రికి ఇదే మంచి అవకాశం.. నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి: గంగూలీ

  • టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి సరైన వ్యక్తి
  • ఇప్పటికే ఐదేళ్ల పాటు జట్టుతో రవిశాస్త్రి ఉన్నారు
  • టీ20 ప్రపంచకప్ లలో రవిశాస్త్రి తనను తాను నిరూపించుకోవాలి

టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రి సరైన వ్యక్తి అని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. 2017లో హెడ్ కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత... తదుపరి కోచ్ ను ఎంపిక చేసేటప్పుడు ఇతరులు దరఖాస్తు చేసుకోకపోవడంతో... శాస్త్రిని ఎంపిక చేయడం మినహా మరో దారి లేకపోయిందని చెప్పారు.

ఇప్పటికే ఐదేళ్ల పాటు జట్టుతో రవిశాస్త్రి ఉన్నాడని... మరో రెండేళ్లు కోచ్ గా కొనసాగే అవకాశం వచ్చిందని... ఇన్నేళ్ల పాటు జట్టుతో ప్రయాణించే అవకాశం మరెవరికీ రాలేదని గంగూలీ అన్నారు. 2007లో బంగ్లాదేశ్ పర్యటనకు గాను రవిశాస్త్రి మేనేజర్ గా వ్యవహరించారు. ఆ తర్వాత 2014లో భారత జట్టుకు డైరెక్టర్ గా సేవలు అందించారు.

రవిశాస్త్రి ముందు 2020, 2021 టీ20 ప్రపంచకప్ లు ఉన్నాయని... జట్టును విజయపథంలో నడిపించేందుకు మార్గాలను ఆయన అన్వేషించాలని గంగూలీ అన్నారు. రవిశాస్త్రి ఇప్పటి వరకు భారత జట్టుకు ఒక ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేదు. దీనిపై గంగూలీ స్పందిస్తూ... రెండేళ్లలో రెండు టీ20 ప్రపంచకప్ లు ఉన్నందున... రవిశాస్త్రికి ఇదే మంచి అవకాశమని తెలిపారు. ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోవాలని అన్నారు.

More Telugu News