Indrani Mukerjea: ముగిసిన ఇంద్రాణి, పీటర్ ముఖర్జియాల వివాహ బంధం.. విడాకులు మంజూరు!

  • గత ఏడాది విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఇంద్రాణి
  • విడాకులతో పాటు ఆస్తుల పంపకాలను ఖరారు చేసిన కోర్టు
  • షీనా బోరా హత్య కేసు, ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న ఇంద్రాణి, పీటర్

మాజీ మీడియా బ్యారన్ పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియాలకు ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. గత ఏడాది సెప్టెంబర్ లో విడాకుల కోసం ముఖర్జియా దంపతులు బాంద్రా శివారుల్లో ఉన్న కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వీరికి కోర్టు నిన్న విడాకులు మంజూరు చేసింది. విడాకులతో పాటు ఆస్తుల పంపకాలను కూడా కోర్టు ఖరారు చేసింది. బ్యాంకు డిపాజిట్లు, ఇతర పెట్టుబడులు, స్పెయిన్, లండన్ లో ఉన్న స్థిరాస్తులను కూడా కోర్టు ఇద్దరికీ పంచింది.

తమ వైవాహిక జీవితం కూలిపోయిందంటూ గత ఏడాది తన భర్తకు ఇంద్రాణి ముఖర్జియా విడాకుల నోటీసును పంపించారు. 2002లో ఇంద్రాణి (47), పీటర్ (65) పెళ్లి చేసుకున్నారు. ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్య కేసులో వీరిద్దరూ విచారణను ఎదుర్కొంటున్నారు. 2015 నుంచి వారు జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బైకుల్లా జైల్లో ఇంద్రాణి ఉండగా, ఆర్థర్ రోడ్ జైల్లో పీటర్ ముఖర్జియా ఉంటున్నారు.

2012 ఏప్రిల్ లో షీనా బోరా హత్య జరిగింది. ఇంద్రాణికి, ఆమె మొదటి భర్త సంజీవ్ ఖన్నాకు షీనా బోరా జన్మించింది.  రాయ్ ఘడ్ జిల్లాలో ఆమె మృత దేహం లభ్యమైంది. ఈ కేసులో ఇంద్రాణి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుండగా... హత్యకు సహకరించినట్టు పీటర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో కూడా వీరు నిందితులుగా ఉన్నారు.

More Telugu News