Chiranjeevi: ముంబై మీడియాకు సైరా షో వేస్తే లేచి నిలబడి చప్పట్లు కొట్టారు: చిరంజీవి

  • సైరా 'థాంక్యూ మీట్' నిర్వహించిన చిత్ర బృందం 
  • 'సైరా' భారత్ సినిమా అంటూ వ్యాఖ్యలు 
  • అనుష్క ఒక్క పైసా తీసుకోలేదన్న చిరు

'సైరా' బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఇతర యూనిట్ సభ్యులు 'థాంక్యూ మీట్' నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఇది తెలుగు సినిమా కాదని, భారత్ సినిమా అని అన్నారు. తెరమరుగైన ఓ సమరయోధుడి కథ అని తెలిపారు. ఈ కథ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే ఎంతో వ్యయప్రయాసల కోర్చి తెరకెక్కించామని వివరించారు.

ముంబయిలో మీడియా వాళ్ల కోసం ప్రత్యేకంగా విడుదలకు ముందురోజు షో వేశామని, సినిమా పూర్తవగానే అందరూ లేచినిలబడి చప్పట్లు కొడుతూ తమ గౌరవం ప్రదర్శించారని చిరంజీవి వెల్లడించారు. ఎప్పుడో పదేళ్ల క్రితం తాము ఓ సినిమాకు ఇలా లేచి నిలబడి గౌరవం చూపించామని, మళ్లీ ఇన్నాళ్లకు సైరా సినిమాకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చామని వారు చెబుతుంటే తనకు కలిగిన ఆనందం అంతాఇంతా కాదని చిరు తెలిపారు.

ఇది తన ఒక్కడి ఘనత కాదని, సమష్టి కృషికి ప్రతిఫలమే సైరా ఘనవిజయం అని అన్నారు. ఇప్పటివరకు తాము అనుష్క గురించి ఎక్కడా ప్రస్తావించలేదని, అది సర్ ప్రైజ్ గా ఉంచామని, ఆమె ఒక్క పైసా తీసుకోకుండా అమెరికా నుంచి వచ్చి నటించిందని కొనియాడారు. ఇంతటి బ్లాక్ బస్టర్ ను తనకు అందించిన ఘనత నిస్సందేహంగా దర్శకుడు సురేందర్ రెడ్డికే దక్కుతుందని చిరంజీవి అన్నారు.

More Telugu News