onion: టమాటా మోత.. మరో వారం రోజులు!

  • ఉల్లిధరతో పోటీపడుతున్న టమాటా 
  • కిలో రూ.42-50
  • ధరల పెరుగుదల తాత్కాలికమేనన్న అధికారులు

కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధర బాటలో ఇప్పుడు టమాటా పయనిస్తోంది. వారం రోజుల క్రితం 10 రూపాయలు ఉన్న కిలో టమాటా ఇప్పుడు ఏకంగా రూ.42 పలుకుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాయ, పూత రాలిపోయి దిగుబడి ఒక్కసారిగా తగ్గడమే ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి దిగుమతి అవుతున్న టమాటాలే హైదరాబాద్‌ అవసరాలను తీరుస్తున్నాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. దీంతో మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి టమాటాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకోసం లారీ కిరాయికే పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు. దీంతో టమాటా ధరను రూ.50కి పెంచి అమ్మాల్సి వస్తోందని వ్యాపారులు తెలిపారు.

ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మరో వారం రోజుల్లో దిగుబడి పెరిగే అవకాశం ఉందని, అప్పటి వరకు ధరలకు కళ్లెం వేయడం కష్టమని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా కూరగాయలపై మచ్చలు ఏర్పడి నాణ్యత దెబ్బతిందని, దీనివల్ల నాణ్యమైన కూరగాయలకు డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. ధరల పెరుగుదల తాత్కాలికమేనని, వర్షాలు ఆగిన వెంటనే ధరలు దిగి వస్తాయని వివరించారు.

More Telugu News