IAF: మన దగ్గర రాఫెల్ ఉంటే చైనా, పాకిస్థాన్ పప్పులు ఉడకవు: వాయుసేన చీఫ్

  • పదవీ విరమణ చేసిన బీఎస్ ధనోవా 
  • కొత్త ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా బాధ్యతలు అందుకున్న భదౌరియా
  • రాఫెల్ అత్యంత సమర్థవంతమైన విమానంగా కితాబు

అత్యాధునిక యుద్ధ విమానం రాఫెల్ భారత వాయుసేన సామర్థ్యాలను మరింత విస్తృతం చేస్తుందని నూతన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. ఇప్పటివరకు వాయుసేన చీఫ్ గా పనిచేసిన బీఎస్ ధనోవా నేటితో పదవీవిరమణ చేశారు. ఆయన స్థానంలో భదౌరియా బాధ్యతలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, రాఫెల్ అమ్ములపొదిలో ఉండడం వల్ల పాకిస్థాన్, చైనాలపై మనదే పైచేయి అవుతుందని, వాళ్ల పప్పులు వుడకవని స్పష్టం చేశారు.

 "రాఫెల్ అత్యంత సమర్థవంతమైన యుద్ధవిమానం. ఒక్కసారి వాయుసేనలో చేరిందంటే కచ్చితంగా మనదే ఆధిపత్యం అవుతుంది. ఎస్ యూ-30 విమానాలు, ఇతర యుద్ధవిహంగాల కాంబినేషన్లో రాఫెల్ ను ఉపయోగించినప్పుడు ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలుస్తాం" అని ధీమా వ్యక్తం చేశారు. విశేషం ఏంటంటే, 2016లో రూ.60 వేల కోట్ల విలువైన రాఫెల్ విమానాల ఒప్పందం కుదరడంలో కీలకపాత్ర పోషించింది భదౌరియానే. 36 రాఫెల్ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్ వెళ్లిన భారత ప్రతినిధుల బృందానికి ఆయనే చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

IAF

More Telugu News