amaravathi: ప్రభుత్వ లక్ష్యం మేరకు సచివాలయ ఉద్యోగులు పనిచేయాలి: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

  • ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు
  • పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలి
  • ఇన్ని ఉద్యోగాలు ఒకేసారి ఇవ్వడం అపూర్వం: బొత్స

వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సమున్నత ఆశయంతో గ్రామ సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెస్తోందని, ప్రభుత్వ లక్ష్యం మేరకు ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. అమరావతిలో ఈరోజు అర్హులైన వారికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నారని అభినందించారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒకేసారి లక్షా 34 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం సాధారణ విషయం కాదని, ఉద్యోగాలు పొందిన వారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు ఎంత బాధ్యతగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత పేరు వస్తుందని అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలు ఎంతో పకడ్బందీగా నిర్వహించినప్పటికీ విపక్షాలు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.

More Telugu News