Anantapur District: నంబర్‌ కేటాయించలేదని ఆటోకి నిప్పంటించి ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన

  • అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఘటన
  • నంబర్‌ ఇవ్వకుండా ఉపాధి తీసేసారని  డ్రైవర్ ధ్వజం
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

రాజకీయ కక్షతో తమ ఆటోకు నంబర్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తమ ఉపాధి అవకాశాన్ని దెబ్బకొట్టారని నిరసిస్తూ ఓ ఆటో డ్రైవర్‌ సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంటిముందు ఆటోకు నిప్పంటించి హల్‌ చల్‌ చేశాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకంట శ్రీధర్‌రెడ్డి ఇంటి ముందు ఈ ఘటన జరిగింది.

పోలీసుల కథనం మేరకు...పుట్టపర్తి పట్టణంలో తిరిగేందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హయాంలో 150 ఆటోలకు నంబర్లు ఇచ్చారు. అలా నంబర్లు ఇచ్చిన ఆ ఆటోలన్నింటికీ తాజాగా నంబర్లు ఇవ్వలేదని నాగేంద్ర అనే ఆటో డ్రైవర్‌ ఆరోపించాడు.

ఆటో నడుపుకొంటూ జీవనోపాధి పొందుతున్న తాము దీనివల్ల రోడ్డున పడ్డామని ధ్వజమెత్తాడు. తమ ఆకలి కేకలు తెలియాలనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపాడు. పోలీసులు నాగేంద్రను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

More Telugu News