Kamal Haasan: ‘ఉత్తమ విలన్’కు రూ. 10 కోట్లు ఇచ్చానన్న నిర్మాత.. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించిన కమలహాసన్

  • కమల్‌కు ఇచ్చిన రూ.10 కోట్లు తిరిగి ఇవ్వలేదని నిర్మాతల మండలిలో ఫిర్యాదు
  • తమిళ చిత్రపరిశ్రమలో తీవ్ర చర్చ
  • తీవ్రంగా స్పందించి నోటీసులు పంపిన కమల్

‘ఉత్తమ విలన్’ సినిమా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రముఖ నటుడు కమలహాసన్‌కు రూ.10 కోట్లు ఇచ్చానని, కానీ ఆ డబ్బులు తిరిగి ఆయన ఇవ్వలేదన్న నిర్మాత జ్ఞానవేల్‌ వ్యాఖ్యలపై కమల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015లో కమల్‌కు ఇచ్చిన పది కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వలేదంటూ నిర్మాతల మండలిలో జ్ఞానవేల్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. నిర్మాత ఫిర్యాదుపై కమల్ తీవ్రంగా స్పందించారు. జ్ఞానవేల్ వద్ద నుంచి తాను డబ్బులు తీసుకోలేదని, తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ జ్ఞానవేల్‌కు కమల్ నోటీసులు జారీ చేశారు.

కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. నిర్మాత జ్ఞానవేల్‌తో తమకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కమల్-జ్ఞానవేల్ మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని, కమల్‌కు ఆయన డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాము దర్శకుడు లింగుస్వామి బ్రదర్స్‌ సంస్థతో మాత్రమే చర్చలు జరిపామని వివరించారు. కమల్ పేరు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యవహరించిన జ్ఞానవేల్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొంటూ నోటీసులు జారీ చేసినట్టు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

More Telugu News