accident: చిన్నారులను కాపాడి చిట్టి తల్లి ప్రాణాలు వదిలింది : చిత్తూరు జిల్లాలో విషాదం

  • నీట మునిగిన పినతల్లి పిల్లలు
  • వారిని కాపాడి ఒడ్డుకు చేర్చిన పదేళ్ల బాలిక
  • గుంటలోని తీగలు కాళ్లకు తగిలి తాను మృత్యువాత

నీటి గుంటలో మునిగిపోతున్న చెల్లి, తమ్ముడిని కాపాడి తాను మాత్రం ప్రాణాలు వదిలింది ఓ పదేళ్ల చిన్నారి. నీటిలో మునిగిపోతున్న వారిని ధైర్యంగా ఒడ్డుకు చేర్చగలిగినా, ఆమె కాళ్లకు తగిలిన తీగలే మృత్యుపాశాలు కావడంతో ప్రాణాలు కోల్పోయింది. చిత్తూరు జిల్లా తొండవాడ పంచాయతీ గోపాలపురం ఎస్టీ కాలనీలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన కౌసల్య (10) తల్లిదండ్రులు చనిపోగా అవ్వతాతల సంరక్షణలో ఉంటోంది. ఐదో తరగతి చదువుకుంటున్న బాలిక దసరా సెలవులు కావడంతో నిన్న తన పినతల్లి పిల్లలు మళ్లీశ్వరి (7), కిరణ్‌ (5)లతో కలిసి సమీపంలోని నీటిగుంట వద్దకు ఆడుకుంటూ వెళ్లారు. ఆటలో పడిన పిల్లలు అనుకోకుండా నీటి గుంటలో పడి మునిగిపోయారు. దీన్ని గమనించిన కౌసల్య గుంటలోకి దిగి ఇద్దరి చేతులు పట్టుకుని ఒడ్డుకు చేర్చింది.

ఈ క్రమంలో నీటిలో తీగలు చుట్టివున్న కర్రలు ఆమె కాలుకు తగలడంతో గుంటలోకి జారుకుని మునిగిపోయింది. ఒడ్డుకు చేరిన పిల్లలు కేకలు వేయడంతో గ్రామస్థులు గుంట వద్దకు చేరుకుని కౌసల్యను కాపాడి ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More Telugu News