టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న అజారుద్దీన్.. నేడు సీఎం కేసీఆర్‌తో భేటీ!

28-09-2019 Sat 06:54
  • హెచ్‌సీఏ ఎన్నికల్లో అజర్ విజయం
  • మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
  • సీఎంతో సమావేశం అనంతరం పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ అజారుద్దీన్ టీఆర్ఎస్‌ కండువా కప్పుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలిచిన అజర్ ప్యానల్ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనుంది. ఈ సమావేశం తర్వాత అజర్ పార్టీ మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో అజర్‌కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపింది. అప్పటి నుంచే గుర్రుగా ఉన్న అజర్.. పార్టీ మారాలని అప్పుడే నిర్ణయించుకున్నట్టు సమాచారం.  

హెచ్‌సీఏ ఎన్నికలకు ముందు కేటీఆర్‌ను కలిసిన అజర్ మద్దతు కోరారు. మరోవైపు, హెచ్‌సీఏపై పట్టు కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ వివేక్ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ అజర్‌కు మద్దతిచ్చింది. ఈ సందర్భంగానే పార్టీలో చేరికపై చర్చ వచ్చినట్టు చెబుతున్నారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచిన వెంటనే అజర్ నేరుగా మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. హెచ్‌సీఏ ఎన్నికలకు ముందు కుదిరిన అవగాహనలో భాగంగా అజర్ టీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను అజర్ ఖండించకపోవడం ఇందుకు మరింత ఊతమిస్తోంది.