తన కార్యవర్గంతో సీఎం కేసీఆర్ ను కలవనున్న అజహరుద్దీన్

27-09-2019 Fri 19:14
  • హెచ్ సీఏ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ ఎన్నిక
  • రాష్ట్రానికి కేసీఆర్ బాస్ అంటూ వ్యాఖ్యానించిన అజర్
  • అజర్ పార్టీ మారతాడంటూ ప్రచారం

హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన తన కార్యవర్గంతో అజర్ సీఎం కేసీఆర్ ను కలవనున్నారు. విజయానంతరం అజర్ మాట్లాడుతూ, రాష్ట్రానికి బాస్ కేసీఆర్ అని అభివర్ణించారు. హెచ్ సీఏ ఎన్నికలు నియమ నిబంధనలకు లోబడి జరిగాయని, ఎలాంటి లోపాలు లేవని స్పష్టం చేశారు.

కాగా, రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేసిన అజర్ గతంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పార్లమెంటుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన త్వరలో పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మార్పుపై మీడియా ప్రశ్నించగా, ఇప్పుడేమీ మాట్లాడలేనని స్పష్టం చేశారు. ఇది క్రికెట్ వ్యవహారమని, రాజకీయరంగం కాదని అన్నారు.