Dassera: దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం: ఏపీ మంత్రులు

  • ఈ నెల 29 నుంచి అక్టోబరు 8 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు
  • లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం
  • ఈ మహోత్సవాలకు సుమారు 18 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

విజయవాడలో ఈ నెల 29 నుండి నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు చేపడుతున్న ఏర్పాట్లను మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు ఈరోజు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ, దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని, భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.

 ఈ నెల 29 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. దసరా మహోత్సవాలకు సుమారు 15 నుంచి 18 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా అక్టోబరు 5న కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలను సీఎం జగన్ సమర్పిస్తారని అన్నారు.

గత ఉత్సవాల్లో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని మరింత సమర్థవంతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మోడల్ గెస్ట్ హౌస్ వద్ద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తామని తెలిపారు.175 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కృష్ణా నదిలో వరదప్రవాహం ఎక్కువగా ఉన్నందున భక్తులు స్నానాలు చేసేందుకు ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
 
భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడతాం: మంత్రి వెల్లంపల్లి

శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడతామని అన్నారు. కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు చేపడతామని, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. వీఐపీల దర్శనానికి ప్రత్యేక సమయాలు కేటాయించామని ఉదయం 7 నుండి 8 గంటల వరకు, తిరిగి 11 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల  వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకూ ప్రత్యేక సమయాలను కేటాయించామని వివరించారు.

More Telugu News