Godavari: బోటు ప్రమాదంలో ప్రయాణికులను రక్షించినవారికి నజరానా ప్రకటించిన ఏపీ సర్కారు

  • ఒక్కొక్కరికి రూ.25 వేలు నజరానా
  • ఇంకా 14 మంది ఆచూకీ తెలియాలన్న మంత్రి కన్నబాబు
  • ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునక ఘటన గోదావరి చరిత్రలో ఓ మరక అని చెప్పాలి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, మరికొందరి ఆచూకీ నేటికీ లభించలేదు. ఈ ప్రమాద ఘటనలో కొందరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడారు. ఈ అంశంపై ఏపీ మంత్రి కన్నబాబు స్పందించారు. బోటు ప్రమాదంలో ప్రయాణికులను రక్షించినవారికి నగదు పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.25 వేలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని వెల్లడించారు.

బోటు ప్రమాదంలో గల్లంతైన 14 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని, బోటును గోదావరి గర్భం నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని కన్నబాబు చెప్పారు. ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా చర్యలు చేపట్టామని వివరించారు. కచ్చులూరు బోటు మునక వ్యవహారంలో ఉన్నతస్థాయి కమిటీతో పాటు మెజిస్టీరియల్ విచారణ కూడా జరుగుతోందని అన్నారు. బోటును బయటికి తీస్తామని కొందరు ప్రయివేటు వ్యక్తులు కూడా వస్తున్నారని, కానీ వరద ఉద్ధృతి పెరుగుతుండడంతో తమ నిర్ణయం మరో ప్రమాదానికి కారణం కాకూడదన్న ఉద్దేశంతో ఎవరికీ అనుమతివ్వలేదని స్పష్టం చేశారు.

More Telugu News