Vijayawada: ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు దుర్గాఘాట్‌ స్నానాలు లేనట్టేనా?

  • కృష్ణా నదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడమే కారణం
  • ప్రత్యామ్నాయంగా కృష్ణవేణి, పద్మావతి ఘాట్‌లలో ఏర్పాట్లు
  • అది కూడా నదీ స్నానం కాకుండా జల్లు స్నానాలకే అనుమతి

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా జరుగుతాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దసరా ఉత్సవాల్లో రోజూ లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. కృష్ణా నదిలో స్నానమాచరించి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తల్లి ఆశీర్వాదం పొందాలని ఆశిస్తారు. కానీ ఈ ఏడాది దుర్గమ్మ భక్తులకు నదీ స్నానాలు సాధ్యమయ్యేలా లేదు. కృష్ణానదిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గేట్లు ఎత్తి కొంత నీరు దిగువకు వదులుతున్నారు.

ఈ పరిస్థితుల్లో భక్తులను నదీ స్నానాలకు అనుమతించడం ప్రమాదకరమని భావిస్తున్న అధికారులు ఆలయం ఎదురుగా ఉన్న దుర్గాఘాట్‌ను పూర్తిగా మూసివేసే అవకాశం ఉంది. బదులుగా కృష్ణవేణి, పద్మావతి ఘాట్‌లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కూడా నదిలో స్నానానికి అనుమతించకుండా జల్లు స్నానాలు (పైపు ద్వారా షవర్లు ఏర్పాటు చేసి) జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెప్పోత్సవానికి సంబంధించి కూడా అధికారులు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ఉత్సవానికి అవసరమైన ఫంట్‌, అలంకరణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో తెప్పోత్సవం ఎక్కడ నిర్వహించాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

నీటి ప్రవాహం, సుడిగుండాలు అధికంగా ఉన్నప్పుడు ఫంట్‌ ప్రయాణం ప్రమాదకరం. దీంతో బ్యారేజీకి దూరంగా పున్నమి ఘాట్‌లో తెప్పోత్సవం నిర్వహించాలా, దుర్గాఘాట్‌లోనే కొనసాగించాలా అని ఆలోచిస్తున్నారు. ఈనెల 29వ తేదీన ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజున జరిగే సమావేశంలో దేవస్థానం అధికారులు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కనకదుర్గ ఫ్లైఓవర్‌ పనులు ప్రస్తుతం సరిగ్గా దుర్గగుడి సమీపంలోనే జరుగుతుండడం కూడా ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు మరో ఆటంకం. కొండ దిగువ నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు మధ్యలో ఉన్న ప్రాంతం చాలా కీలకం. కానీ, ఈ ప్రాంతంలోనే వంతెన పనులు జరుగుతుండడం, ఎక్కడికక్కడ నిర్మాణ సామగ్రి పడివుండడంతో ఉత్సవాల నిర్వహణ అధికారులకు కత్తిమీద సామే.

More Telugu News