వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. భర్తకు విషాహారం తినిపించి చంపిన భార్య

27-09-2019 Fri 09:28
  • మహబూబాబాద్ జిల్లాలో ఘటన
  • పంచాయితీ పెట్టడంతో భర్తపై కక్ష
  • ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి హతమార్చిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తకు విషాహారం తినిపించి ప్రాణాలు తీసిందో భార్య. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని  మూడు గుడిసెల తండాకు చెందిన మాలోత్ మోహన్ (30), పావని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అజ్మీర శ్రీనుతో పావని వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త దీనిని పెద్దమనుషుల దృష్టికి తీసుకెళ్లాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు పావనిని మందలించారు.

దీంతో భర్తపై కక్ష పెంచుకున్న పావని.. ప్రియుడు శ్రీనుతో కలిసి భర్తను అడ్డుతొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. అందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం విషం కలిపిన ఆహారాన్ని అతడికి అందించింది. అది తిన్న మోహన్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన మోహన్ తల్లి హేమ్లీ, గ్రామస్థుల సాయంతో కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మోహన్ తల్లి ఫిర్యాదుపై గురువారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.