ESI Director: కోట్లాది రూపాయల కుంభకోణం కేసు.. తెలంగాణ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణి అరెస్ట్

  • మందుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం
  • వరంగల్ కేంద్రంగా స్కామ్
  • రెండు నెలలుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ

తెలంగాణ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ షేక్ పేటలోని నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో ఈ అరెస్ట్ జరిగింది. మెడికల్ డైరెక్టర్ దేవికా రాణి ఈ స్కామ్ వెనుక కీలక పాత్ర పోషించినట్టుగా సమాచారం.

గత రెండు నెలల నుంచి ఈ స్కామ్ పై ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. 23 మంది ఇళ్లల్లో సోదాలు జరుపుతోంది. దేవికా రాణి, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న డిస్పెన్సరీల నుంచి ఆసుపత్రుల వరకు ఈ కుంభకోణం చోటు చేసుకున్నట్టు ఏసీబీ తేల్చింది.

ఉపయోగం లేని మందులను కూడా వీరు కొనుగోలు చేశారు. ఫార్మా కంపెనీలు లేకుండానే మందులు కొన్నట్టు చూపించారు. అన్ని షెల్ కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ కుంభకోణం ఇప్పుడు సంచలనం రేపుతోంది. వరంగల్ కేంద్రంగా స్కామ్ చోటు చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తేల్చారు. రూ. 12 కోట్ల వరకు కుంభకోణం ఉంటుందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దాదాపు 100 నుంచి 200 కోట్ల వరకు అక్రమంగా మందులు కొనుగోలు చేసినట్టు అంచనా వేస్తున్నారు.

More Telugu News