Andhra Pradesh: ఏపీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సీఎం జగన్ ఆదేశాలు

  • పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదు 
  • అటవీ, పర్యావరణ శాఖలపై సమీక్షించిన జగన్
  • పరిశ్రమల కాలుష్య నియంత్రణకు హరిత పన్ను విధిస్తాం

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అటవీ, పర్యావరణ శాఖలపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

అడవుల సంరక్షణ, వన్యప్రాణుల భద్రత, మొక్కల పెంపకంపై చర్చించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు హరిత పన్ను విధిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళనకు చర్యలు చేపడతామని చెప్పారు. విశాఖపట్టణం కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెడతామని అన్నారు. గోదావరి జిల్లాల్లో పంటకాల్వల పరిరక్షణకు ‘మిషన్ గోదావరి’ చేపడతామని తెలిపారు.

More Telugu News